February 18, 2014

కొసమెరుపురచయిత ఓ హెన్రీ ఇంట్లో కాసేపు ....

       

                                                                   


చికాగో నుంచి ఆస్టిన్ కి మారినపుడు  . లేక్ మిచిగన్ నీలి రంగు అలల్నీ, వసంత కాలంలో ఇల్లినాయి సౌందర్యాన్నీ, శీతాకాలంలో కురిసే మంచు పూల సౌందర్యాన్నీ భయంకరంగా మిస్ కావడానికి సిద్ధ పడి పోయి ప్రయాణం కట్టాను.  పైగా ఇక్కడికి రాగానే మా గుంటూరుని తలపిస్తూ మండి పడుతూ కాసే ఎండలు స్వాగతించాయి! చల్లని  చికాగో చల్ల గాలే లేదు అని దిగులు పడ్డాను.

సరే....  వూరు చూడాలని అనుకుంటూ ఏమున్నాయని వెదుకుతుంటే కాస్త పుస్తకాలు చదివే అలవాటున్న పక్కింటి అమ్మాయి  "ఓ హెన్రీ మ్యూజియం చూడండి. మీకు నచ్చుతుంది" అని సలహా ఇచ్చింది. ఇంటికొచ్చి ఆన్ లైన్లో  వెదికితే.. అరె.. మా ఇంటికి గట్టిగా నాలుగు మైళ్ళ దూరంలోనే ఓ హెన్రీ మ్యూజియం ఉందని తెలిసింది.
ఓ హెన్రీ నాకు  The gift of Maggie  కథతో స్కూలు రోజుల్లోనే పరిచయం! ఆ కథ చివర్లో చమక్కుమని మెరిసి "అయ్యో"అనిపించే కొసమెరుపు గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఆ తర్వాత కూడబలుక్కుని ఇంగ్లీష్ కథలు చదివే అచ్చమైన తెలుగు మీడియం స్టూడెంట్ గా లైబ్రరీ లో దొరక బుచ్చుకుని ఓ హెన్రీ కథలు చాలానే చదివాను. ఆ చటుక్కుమని మెరిసే కొసమెరుపు గుండెలో కదిలించే ఒక "హుఫ్" అనే ఫీల్ కోసం అవన్నీ చదివాను!పదునైన హాస్యంతో సాగుతూ చివర్లో సడన్ గా తిరిగే ఆ మేలి మలుపు వల్లే ప్రతి ఏ కథకు ఆ కథే ప్రత్యేకంగా గుర్తుండి పోతుంది.
                                     గిఫ్ట్ ఆఫ్ మాగి కథ .. రోలింగ్ స్టోన్  పత్రిక లో ఆ రోజుల్లో ... రంగుల్లో

రచయితగా, వ్యంగ్య రాజకీయ కార్టూనిస్ట్ గా, పత్రికా ఎడిటరు గా బహుముఖ ప్రజ్ఞా శాలి గా పేరు గాంచిన ప్రసిద్ధ రచయిత నేనుంటున్న వూళ్ళోనే పుష్కరం పాటు నివాసం ఉన్నాడని తెల్సి సంతోషం తో ఆయన ఇల్లు చిరునామా తీసుకుని ఒక వీకెండ్ వెళ్ళాము .

                                                                 ఆస్టిన్ లో ఇల్లుఆస్టిన్ డౌన్ టౌన్ లో ఎత్తైన భవనాల మధ్య ఒక అతి సామాన్యమైన ఇల్లు ...పచ్చని చెట్ల మధ్య కనిపించింది...రోడ్డు పక్కగా "ఓ హెన్రీ మ్యూజియం" అన్న బోర్డుతో!

నడక దారి లోంచి నాలుగడుగులు వేయగానే పోస్టు బాక్సూ, అక్కడి నుంచి మూడు మెట్లు ఎక్కగానే పొడుగాటి వరండా!


                                     ఈ మెయిల్ బాక్స్ కి ఎన్ని విలువైన ఉత్తరాలు వచ్చి ఉంటాయో


తలుపు తోసుకుని వెళ్లగానే నిర్మానుష్యంగా ఉంది ఇల్లు !!
ఎవరూ లేరా గైడ్ లాగా వివరించే వాళ్ళు అనుకుంటూ పక్క గదిలోకి తొంగి చూస్తే అక్కడ ఒక పాత చెక్క రాత బల్లా , దాని ముందు కుర్చీ కనిపించాయి.

సంభ్రమం!
                                                            ఆయన వాడిన రైటింగ్ టేబుల్

అబ్బ, ఆ రాత బల్ల మీదే హెన్రీ నేను చదివిన మొదటి కథ రాసి ఉంటాడా?
ఆ బల్లని అబ్బురంగా చూస్తుండగానే లోపలి నుంచి ఒకమ్మాయి వచ్చింది.  ఆమె ఒక స్కూలు టీచరు. వేసవి సెలవుల్లో అక్కడ పార్ట్ టైముగా పని చేయడానికీ, స్వయం గా రచయిత అభిమాని కూడా కావడం వల్లనూ సైట్ కో ఆర్డినేటర్ గా సందర్శకులకు రచియిత జీవిత విశేషాలు వివరించడానికి ముందుకొచ్చింది .ప్రతి గదీ చూపిస్తూ, ఓ హెన్రీ జీవితానికి, వృత్తికి సంబంధించిన విషయాలన్నిటినీ శ్రద్ధగా వివరిస్తూ అక్కడి ప్రతి వస్తువు వెనుక చరిత్రనూ వీలైనంత వివరంగా పంచుకుంది. ఎన్ని ఫొటోలైనా తీసుకోడానికి దయతో ఉదారంగా అనుమతి ఇచ్చింది.ఓ హెన్రీగా పేరు గాంచిన విలియం సిడ్నీ పోర్టర్ ఆ ఇంట్లో నివసించిన కాలంలో అతని జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. కొన్ని సంతోషాలైతే మరి కొన్ని విషాదాలు ఆ ఇంట్లో ఆయన చవి చూశాడు.  చివరకు అతనికి జైలు జీవితం కూడా ఈ ఇంట్లో నివసిస్తున్న  కాలంలోనే సంప్రాప్తమైంది.  అతను నివసించిన ఈ ఇల్లు నిజానికి ఇప్పుడున్న చిరునామాలో లేదు. కొన్ని వీధులకు అవతల ఉండేది.


ఆస్టిన్ స్థానిక ప్రభుత్వం  1934 లో ఆయన జ్ఞాపకార్థం ఆ ఇంటిని మ్యూజియంగా మార్చి యధా తధంగా చెక్కు చెదరకుండా ఇపుడు ఉన్న ప్రాంతానికి తరలించి సందర్శకులకు అందుబాటులో ఉంచింది.   ఆ ఇంట్లోని ప్రతి చిన్న వస్తువునూ అతి జాగ్రత్తగా సంరక్షించి ఉంచింది.విద్యుత్తులేని  రోజుల్లో వారు వాడిన పొయ్యి, కిరోసిన్  దీపాలు, చలి కాచుకునే ఫైర్ ప్లేస్, రచయిత అద్దెకు తెచ్చిన పియానో, అతని భార్య వాడిన కుట్టు మిషను, ఆమె పెయింట్ చేసిన పింగాణీ ప్లేట్లు,వారి పిల్లలు ఆడుకున్న బొమ్మలు, ఆటవస్తువులు, ఆయన పుస్తకాలు, ఆయన సర్వేయర్ గా పని చేసిన కాలం లో గీసిన ఆస్టిన్ నగరం మ్యాపులు , పోర్టర్ కూచున్న వూగే కుర్చీ, ఆయన వాడిన పెన్నులు. అతని పుస్తకాల బీరువా  ఇవన్నీ సందర్శకులకు  కలిగించే అనుభూతి చిత్రంగా ఉంటుంది. ఆయన సంపాదకుడు గా ఉన్న రోలింగ్ స్టోన్ పత్రిక తాలూకు జేగురు రంగు పాత కాపీలు, ఆయన డిక్షనరీ, పుస్తకాల బీరువా.. అన్నీ  క్షేమంగా ఆ నాటి వాతావరణాన్ని గుర్తు చేస్తూ అక్కడ ఆ చిన్న ఇంట్లో భద్రంగా ఉన్నాయి.

                                                                       భార్య, కూతురు లతో

అక్కడ ఉన్న రాత బల్ల ఆయన  గిఫ్ట్ ఆఫ్ మాగి కథకు స్ఫూర్తిని ఇచ్చిందని తెలిశాక మరింత సంతోషం! ఆ కథతోనే నాకు హెన్రీ పరిచయం
                                                                       ఆయన డిక్షనరీ


విలియం సిడ్నీ పోర్టర్ కొంత కాలం పాటు ఆస్టిన్ కి సుమారు 80 మైళ్ళ దూరంలోని శాన్ ఆంటోనియో నగరంలో కూడా నివసించాడని, ఆయన స్వయంగా నడిపిన "రోలింగ్ స్టోన్" హాస్య పత్రికను అక్కడి నుంచే నిర్వహించాడని, ఆ ఆఫీసు/ఇల్లుని అక్కడి లోకల్ ప్రభుత్వం మ్యూజియంగా మార్చి ప్రదర్శనకు ఉంచిందని చెప్పడంతో నాకు అక్కడి మ్యూజియాన్ని కూడా చూడాలని ఉత్సాహం పట్టుకుంది.

                                                    శాన్ ఆంటోనియో లో ఆయన ఆఫీసు/ఇల్లు

ఆ మరుసటి వారాంతమే అక్కడికి వెళ్ళాను. ఆ అడ్రస్ లో ఒక పెద్ద వ్యాపార భవనం కనిపించింది."అద్దెకు"అన్న బోర్డుతో! చుట్టూ ఎత్తైన భవనాలు. GPS లో మాత్రం అదే చిరునామా అని చూపిస్తోంది. ఎవరిని అడగాలని ఆలోచిస్తూ ఉండగా వీధి మొగదల ఒక విశాల మైన చెట్టు కింద ఒక చిన్న రైల్వే కాబిన్ వంటి చిన్న పాత గది ఒకటి కనిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే అదే__________ ఓ హెన్రీ ఇల్లు, రోలింగ్ స్టోన్ పత్రికాఫీసు.
                                                                 రోలింగ్ స్టోన్ పత్రిక కాపి

ఆ ఇల్లు ని 1855 లో కట్టారట. అది కూడా ఇప్పుడు ఉన్న చిరునామాలో కాక వేరే చోట ఉండేది. దాన్ని కూడా ప్రదర్శన నిమిత్తం యధా తధంగా ఇప్పుడున్న ప్రదేశానికి అతి జాగ్రత్తగా తరలించారు. నేను వెళ్ళిన రోజు సెలవు రోజు కావడంతో అది మూసేసి ఉంది. అందులో రోలింగ్ స్టోన్ పాత ప్రతులూ ఎడిటింగ్ పనులకు సంబంధించిన ఇతర వస్తువులూ పుస్తకాలు దీపాలు మొదలైనవి ఉన్నాయట.

                                      ఆయన  భార్య స్వయంగా పెయింట్ చేసిన పింగాణి వస్తువులు

కదిపితే ఊడేలా ఉన్న తలుపు, పాత దనం కొట్టొచ్చినట్లు కనపడే  కిటికీలకు కట్టిన మాసిన తెల్లని తెరలు ఇవన్నీ బయటి నుంచి చూస్తున్నా... ఆనాటి కాలానికి సందర్శకుల్ని ప్రయాణం  కట్టించేలా కనిపించాయి. ఆ ఇంటిని అప్పట్లో పోర్టర్ నెలకు ఆరు డాలర్ల చొప్పున అద్దెకు తీసుకున్నాడట.

                                                                          బొగ్గు కాలే ఫైర్ ప్లేస్

ఆ చిన్న ఇల్లు/ఆఫీసు నుంచే ఆయన రోలింగ్ స్టోన్ పత్రిక నడిపాడట.సరదా కవితలు, వ్యంగ్య, హాస్య రచనలకు అందులో ప్రాధాన్యం . అయితే అవి కొందరు వ్యక్తులకు కోపం తెప్పించడం వల్ల , సిడ్ని పోర్టర్ కి హెచ్చరికలు కూడా ఎదురయ్యాయి. ఫలితంగా పత్రిక ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుని ఇక్కడి నుంచి ఆయన ఆస్టిన్ కి మకాం మార్చాల్సి వచ్చింది .ఆస్టిన్ లో  పోర్టర్ బాంక్ లో టెల్లర్ గా ఉద్యోగం చేశాడు.
అయితే విధి నిర్వహణ లో కొంత నిర్లక్ష్యం గా వ్యవహరించడం వాళ్ళ  బాంకు నిధుల గోల్ మాల్ నేరం లో భాగాన్ని పోర్టర్ కూడా తలకెత్తుకుని మూడేళ్ళ పాటు జైలు శిక్ష కూడా  అనుభవించాల్సి వచ్చింది . సిడ్ని పోర్టర్  జైల్లో ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఓ హెన్రీ కలం పేరుతో కథలు రాశాడు .  జైలు నుంచి విడుదల అయ్యే నాటికే ఓ హెన్రి గా మంచి పేరు సంపాదించాడు


                                                            హెన్రీ  ఇంటి ముందు మా అమ్మాయి

జైలు నుంచి విడుడులయ్యాక న్యూయార్క్ లో స్థిర పడిన పోర్టర్ న్యూయార్క్  వరల్డ్ సండే మాగజిన్ అనే పత్రికకు వారానికో కథ చొప్పున ఎన్నో కథలు రాసాడు . మంచి కథకుడు గా ఎంతో  పేరు సంపాదించిన పోర్టర్ తాగుడు వల్ల ఆరోగ్యం చెడి 48 ఏళ్ల  వయసులోనే 1910 లో కన్ను మూశాడు .

The gift of Maggie,
Ransom of red chief,
The duplicity of Hargreaves


వంటి కథల్ని పాఠకులు ఎప్పటికి మర్చిపోరు. అలాగే ఓ హెన్రీని కూడా !


                                                                   అద్దెకు తెచ్చిన పియానో

ఓ హెన్రీ కథలు చదవడమే తప్ప అతని జీవితం గురించి ఎప్పుడూ తెలుసుకోవాలని అనుకోని నేను అనుకోని విధంగా ఆయన ఇల్లుని, వాడిన వస్తువుల్ని, ఆయన రచనల్ని, ఇతర వ్యక్తిగత సామగ్రిని కూడా చూసి ముట్టుకుని మరీ అనుభూతి చెందటం నాకే వింతగా అనిపించింది.

నా అభిమాన  రచయిత టెక్సాస్ లోని రెండు నగరాల్లోనూ నివసించిన రెండు ఇళ్లనూ దర్శించడం నాకు మాత్రం ఒక జ్ఞాపకంగా మిగిలి పోతుందేమో!ఆ ఇళ్ళను, ఇంట్లోని అతి చిన్న వస్తువునీ ప్రభుత్వం భద్ర పరిచి, ఆ గొప్ప రచయిత జ్ఞాపకాలను, ఆ సాంస్కృతిక వారసత్వాన్ని భావి తరాల పాఠకుల అందించిన తీరుని చూస్తుంటే మన ప్రభుత్వాలు గుర్తొచ్చి మనసులో చేదుగా ఒక భావం కదలాడింది. నిరుత్సాహంతో ఒక నిట్టూర్పు కూడా!!

(ఫిబ్రవరి 16, సూర్య దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురితం )

అయితే స్థలాభావం వల్ల  సూర్య దినపత్రిక లో ఫోటోలు అన్ని పబ్లిష్ కాలేదు . నిజానికి ఫోటోలన్నీ  ఒకెత్తు ! ఎందుకంటే ఇదివరలో అక్కడ ఫోటోలకు అనుమతి లేదు . నేను వెళ్ళిన సమయంలో అక్కడ ఏదో పుస్తకావిష్కరణ జరుగుతూ ఉండటం తో  అభిమానులను ఫోటోలకు అనుమతించారు .

అంతే కాదు , రచయితకు సంబంధించిన రచనలు ఏవైనా అలభ్యంగా ఉన్నవాటిని సంపాదించడం , కథల మీద చర్చలు, వర్క్ షాపు లు ఇవన్ని తరచూ ఈ మ్యూజియం నిర్వహిస్తుంది .

అదీ సంగతి !! 

January 8, 2014

ఒక ఆత్మహత్య ..."ఆత్మ హత్య శక్తి నిశ్శేషంగా నశించిన వాళ్ల అధిక శక్తి" ___________  చలం ఒక కథలో అంటాడు!!

జీవితమంటే అధైర్య పడ్డ వాళ్ల అద్భుత సాహసం, 
జీవితం దుర్భరమైనపుడు నిష్క్రమించే ఏక కవాటం...., ఎంత శక్తివంతమైన వ్యక్తీకరణ! ఎంతటి సహానుభూతి!!

మొపాసా ఒక కథ రాశాడు.  జీవితం మీద ఇక ఏ ఆశా లేని వాళ్లు సుఖంగా ఆత్మ హత్య చేసుకుని ఈ లోకాన్ని వీడి పోవడానికి ఒక క్లబ్ ఉంటుంది ఆ కథలో! అక్కడికి వెళ్ళిన వాళ్లని ఓడిపోయిన వాళ్లుగా చూడరు.  అక్కడికి వెళ్ళిన వ్యక్తుల కష్టం ఏమిటో తెల్సుకుని వీలైతే దాన్ని తీర్చి మరణం వరకూ వెళ్లకుండా ఆపుతారు.
లేదా అది తీర్చలేని కష్టమైతే.. మరణం భయంకరంగానూ, వేదనా భరితంగానూ రక్త సిక్తంగానూ ఉండక ఆ చివరి క్షణాలు శారీరకంగా ఎలాటి వేదనా లేకుండా సుఖంగా ఉండేందుకు ఆ క్లబ్ ని ఆహ్లాదకరంగా ఉంచుతారు.

ఆ కథ ఒక ఊహ . ఆ కథలో కూడ ఇది కలే ! శరీరాన్ని హింసించి నరక యాతన పడి ప్రాణాలు తీసుకునే వారి పట్ల మొపాసా ప్రకటించిన బాధ అది !

పేపర్లో వార్తలు చూస్తుంటాం, పుట్టింటికి వెళ్ళొద్దంటే కిరోసిన్ పోసుకుని కాల్చుకుందనో, బెండకాయలు తెమ్మని పెళ్ళాం పట్టు బట్టిందని ఉరేసుకున్నాడనో .. !
పోయిన వాళ్లెలాగూ వచ్చి నిజాలు చెప్పలేరు కాబట్టి ఇవి అప్పటికప్పుడు పుట్టే ఆలోచనలే తప్ప అసలు కారణాలు ఎప్పుడో పుట్టి పెరుగుతూ ఉంటాయి, ఆ క్షణం ముంచుకొచ్చే వరకూ....ఆబ్వియస్ లీ !

ఆత్మ హత్యలెప్పుడో తప్ప క్షణికావేశాలు కావు.వాటికి రూట్స్ చాలా బలమైనవి. ఎప్పటి నుంచో పేరుకున్న బాధ, జీవితం పట్ల నిరాశ, దుఖం , నిరసన పెరిగి పెరిగి ఆ క్షణానికి దారి తీసిన క్షణాన ఒక్కోసారి "కడుపు నొప్పి " వంటి కారణాలతో ఉత్తరాలు గా దర్శన మిస్తుంటాయి.

ఇక మామూలుగానే మనలో చాలా మంది పోయిన వాళ్ల పెయిన్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి కనీసం రెండు రోజులైనా తీసుకోకుండా "నువ్విలా చేసుండకూడదోయ్ వెధవాయ్ "  అని సలహాలిచ్చేస్తుంటారు.........  గట్టున క్షేమంగా కూచుని!

లేదా "పిల్లల బాధ్యత లేదా , కట్టున్నదాని/వాడి బాధ్యత లేదా ?" అని ప్రశ్నలు! అంటే ఆ బాధ్యతలు తీర్చేస్తే పోయినా పర్లేదు!

ఇహ .... జీవితాన్ని గౌరవించాలని మరో పక్క పాఠాలు! జీవితం కడు చేదుగా నిమిష నిమిషమూ తినే కంచంలో విషం కక్కుతుంటే, ఒళ్లంతా అనుక్షణం ఎగతాళిగా మంటలు రేపుతుంటే  ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో గౌరవం?

ఐదు వేలు అప్పు తీర్చలేక కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకున్న రైతు గురించి చదివాను మొన్న పేపర్లో! ఐదు వేలు మనలో చాలా మందికి ఒక పెద్ద మొత్తం కాక పోవచ్చు. అయినా ఆ రైతు మనకు తెలిసిన వాడైనా ఎంతమంది ఆ డబ్బు (తిరిగి రాదనే నమ్మకంతో) ఇవ్వగలం? అంతటి చిన్న మొత్తం కోసం కుటుంబం అంతా ప్రాణాలు వదిలే పరిస్థితి వస్తుందని అది జరిగే వరకూ ఎవరమూ ఊహించం!

ఆత్మ హత్యలు చేసుకునే వాళ్లు అర్జెంట్ గా పిరికి వాళ్ళై పోతారు మన కేటలాగ్ (కేవలం టాపిక్ ఉంటే తప్ప రాయలేని వాళ్ళు) రచయితల చేతిలో పడి!

రేపటి నుంచి మన ఉనికి ఉండదని, రేపటితో మన చరిత్ర ముగిసి పోతుందని, ఇక బంధాలేవీ మిగలవని, తను ఇక కొన్నాళ్ళు మాత్రమె ఒక జ్ఞాపకమని ఆ పైన గత చరిత్రగా మారతాననీ తెల్సి జీవితాన్ని విసిరి కొట్టడానికి ఎంతో ధైర్యం కావాలి.

కను చూపు మేరలో దిక్కు తోచని అంధకారమే తప్ప వెలుగు తోచని నిస్సహాయతలో తీసుకున్న ఆ నిర్ణయం వెనుక ఉన్న నొప్పిని  మనుషులుగా  అర్థం చేసుకోగలుగుతున్నామా?

"బంగారం పడితే మన్నైన వాళ్ళు, అన్ని ఆశలూ, ఆనందాలూ నశించిన వాళ్ళు, ఈ  జన్మంతా  కఠోరమైన కాలు కింద రాసిన విధి, అనంతరము కరుణ చూపుతుందనే ఆశతో మరణ దేవిని కావలించుకుని ఈ మాయా జగత్తు నించి నిష్క్రమించిన వాళ్ళు"_________అన్న దృష్టితో ఆ నొప్పిని చూడగలుగుతున్నామా?

సందు చిక్కితే చాలు, 'ఇది సమాజం చేసిన హత్య ' అనో, 'ఈ కుళ్లు వ్యవస్థ చేసిన దురాగతం'  అనో మొత్తం సమాజం మీదికి నెట్టేసి ఒక పనై పోయిందనుకోవడం!

ఇలాటి స్పందనలు అసంకల్పిత ప్రతీకార చర్య గా అలవాటు పడ్డాం!

ఎంతగా మరణించాం మనం !! 

గుండె రాయి చేసుకుని పిల్లలతో సహా బావిలో దూకే తల్లులూ, అప్పులు తీర్చలేక, కుటుంబం తో సహా కడతేరి పోయే సన్నకారు మనుషులూ, ఆ పని చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఇక ఏ వెలుగూ లేదని గట్టిగా రూఢిగా నిర్థారణ అయిన క్షణానే అంతటి దారుణానికి ఒడిగడతారు. ప్రాణాలు పోయే ఆ చివరి క్షణాల్లో బతకాలనే ఒక ఆశ ఉప్పెనలా ముంచుకొచ్చినా అప్పటికే ఆలస్యమై పోయిన అభాగ్యులెంతమందో మనకేం తెలుసు??

వ్యక్తులు అలాటి స్థితిలో మన కళ్ల ముందే ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. మనలో ఎవరమూ వారి బాధలేమిటో తెలుసుకుని మాట సాయం అయినా చేస్తున్నామా?

ఆ బాధ్యతలు మనకు అక్కర్లేదు. కానీ వాళ్లు జీవితాన్ని ముగిస్తే, పోరాడాలని, అలా చేసుండకూడదని, ఎంతో భవిష్యత్తు ఉందని ప్రవచనాల చిట్టా విప్పుతాం!

ఆత్మ హత్యలు జరగని సమాజం కావాలంటే ప్రపంచం లో ఎక్కడా వీలు కాదేమో! ఎందుకంటే ప్రపంచం నిండా బాధ ఉంది. నొప్పి ఉంది. వేదన ఉంది.

కష్టాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఉన్నా ,నష్టం నుంచి తేరుకోవాలనే ఆశ ఉన్నా , అందుకు తగిన అవకాశాలు అందరికీ రావు.

ఒక ఆత్మ హత్య జరిగితే దాని దానికి వెనుక ఎంతోమంది వ్యక్తులు ఉంటారు పలు రకాలుగా దోహదం చేస్తూ!
ఒక్కోసారి కనీసం మాట సాయమైనా చేయని మనం కూడా ఆ జాబితాలో ఉండొచ్చు మనకు తెలీకుండా!

చావడానికి ఉన్న ధైర్యం బతకడానికి లేక పోయిందంటే ఆ పరిస్థితి ఎంత దుర్భరం!!

నేను పోతే లోకులేమనుకుంటారో అన్న ఆలోచన లేకుండా,   ఆ పనికి ఒడిగట్టే వారు "లోకులేమనుకుంటే నాకేం? నా ఇష్టం వొచ్చినట్టు నేను బతుకుతా" అనే ధైర్యాన్ని కూడగట్టుకోలేని నాడు ఆత్మ హత్యే శరణ్యం అవుతుందేమో!

కొద్దిగా దయ ఉంటే కష్టం లో ఉన్న మనిషికి చేయి అందించాలి. అది చాత గాని నాడు గుండెలో తడి మిగిలి ఉంటే ఒక చుక్క కన్నీరు రాల్చాలి. అంతే తప్ప శవాన్ని టీవీలో చూస్తూ వ్యక్తిత్వ వికాస పాఠాలు మొదలెడుతుంటే మరింత నొప్పిగా ఉంటుంది

జీవితాన్నే కాదు, అభాగ్యుల మరణాల్ని కూడా గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటామో !!January 1, 2014

I am not scared (ఇటాలియన్ సినిమా )

                               నాకు హారర్లు, థ్రిల్లర్లు చూడ్డం అంతగా అలవాటు లేదు.  మరీ ఎప్పుడైనా చూడాలి అనిపిస్తే రాత్రి పది తర్వాత న్యూస్ ఛానెల్స్ చూస్తాను. వాళ్ళైతే నిజ జీవితం లో జరిగే నేరాలకు కల్పనలూ తళుకులూ అద్ది, బ్రహ్మాండంగా స్క్రీన్ ప్లే రాసి, పాత్రలవీ పెట్టి నిజానికి అసలు నేరం అలా జరిగి ఉండక పోయినా, అది సమాచారం కోసం గాక సస్పెన్స్ కోసం చూస్తున్నట్టు ఆ భ్రమలో మనల్ని ముంచెత్తుతారు. కార్యక్రమానికి తగ్గ ఆహార్యంతో యాంకర్స్ ని పెట్టి మరీ!
 మొన్న ఒకరోజు అనుకోకుండా ఈ సినిమా నాకు పబ్లిక్ లైబ్రరీ లో దొరికింది. థ్రిల్లింగ్ సినిమా అని బ్లూరే కవర్ మీద కనిపిస్తున్నా ఆ పిల్లాడి కళ్ళలో ఉన్న తీవ్రమైన ఆకర్షణ నన్ను కట్టి పడేయడం తో అప్రయత్నంగానే దీన్ని ఎంచుకుని తెచ్చాను.  ఇంటికి వచ్చాక ఇది Netflix లో కూడా ఉందని తెల్సింది :-)

సినిమా చూశాక ఇది థ్రిల్లర్ గా ఎలా ముద్ర వేసుకుందో తెలీదు కానీ అరమరికలు లేని బాల్యాన్ని, స్వచ్ఛ మైన పసి హృదయానికి అద్భుతమైన ఆవిష్కరణ అని మాత్రం గట్టిగా అనిపించింది.

దక్షిణ ఇటలీలో ఒక గ్రామం లో దిగంతాల వరకూ వ్యాపించిన బంగారు రంగు గోధుమ పొలాల్లో వేసవి సెలవుల్లో స్నేహితులతో కల్సి విచ్చల విడిగా  ఆడుకుంటూ హద్దులు లేని బాల్యపు ఆందాన్ని మూటగట్టుకుంటూ ఉంటాడు పదేళ్ళ మిఛెల్!వాడికిహ వేరే పనేమీ లేదు. తిని, తిరిగి ఆడుకోడం! ప్రపంచమంతా వాడిదే! సంతోషాలన్నీ వాడివే! సెలవులన్నీ వాడివే 


 ఆ పొలాల చివర ఉన్న పాడు బడ్డ ఇంట్లో శిధిలమైన దూలాలు వాసాలు ఎక్కి అవి విరక్కుండా దిగడం లాంటి పందాలు,ఆ పొలాల మధ్య సైకిళ్లు వేగంగా తొక్కుతూ ఇంటికి ఆలస్యంగా చేరుకోడం,  కారణం తెలీని బాల్యపు పిచ్చి సంతోషం తో కేకలు వేస్తూ ఆ పొలాల్లో పడి దొర్లడం , వాడికీ వాడి తోకగా తిరిగే వాడి చెల్లి కీ అలవాటు. వాళ్ళ నాన్న  ట్రక్ డ్రైవర్ కావడం వల్ల  ఇంటికి అపుడపుడు వస్తుంటాడు.  పిల్లలంటే అమిత ప్రేమ!

ఒకరోజు బాధ్యతలే లేని ఆ రికామీ బాల్యపు ఆటల తర్వాత ఇంటికి అన్నాచెల్లెళ్ళు తిరిగి వచ్చాక చెల్లి గారి కళ్ళ జోడు ఆ పాడు బడ్డ కొంప దగ్గరే ఎక్కడో పడిపోయిందని గ్రహిస్తారు. ఆ కళ్ళ జోడు తేవడానికి మిఛెల్ ఒక్కడే సైకిలేసుకుని వెళ్తాడు. అక్కడ వెదుకుతూ ఉండగా మిఛెల్ కాలు బోలుగా ఉన్న ఒక   రేకు మీద పడుతుంది. దానికింద ఏదో గోతిలా కనిపించడంతో ఆ రేకు తొలగించి చూస్తాడు. నిజంగానే ఒక గోతి. అందులో ఒక నల్లని దుప్పటి కింద ఒక చిన్న పిల్లాడి పాదం కొద్దిగా బయటికి వచ్చి కనిపిస్తుంది. మిఛెల్ కి గుండె ఆగినంత పనవుతుంది.  భయంతో పారి పోయి వచ్చేస్తాడు. 
 తర్వాత కొద్దిగా ధైర్యం తెచ్చుకుని అది ఎవరో తెల్సుకోడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ ఒక పిల్లాడిని ఎవరో దాచి ఉంచారని మాత్రం వాడికి అర్థం అవుతుంది.తర్వాత ???

ఏం చెయ్యాలి? వాడితో "నువ్వెవరు, ఇక్కడున్నావేంటి?" లాంటి ప్రశ్నలు వేసినా సరైన జవాబులు రావు కానీ ఆ పిల్లాడు లేచి నిలబడేసరికి వాడిని చూసి హడలి పోయి దడుచుకుంటాడు ఫిలిప్పో! చింపిరి చుట్టు, ఒంటి మీద రక్తం చిందే గాయాలు, సరిగా చూపు ఆనని సగం మూసుకు పోయిన కళ్ళూ ఇదీ వాడి ఆహార్యం!
 తర్వాత కొద్దిగా భయం తగ్గి ఆ పిల్లాడికి దాహం వేస్తుందంటే ఒక చేద సంపాదించి కాసిన్ని నీళ్ళు లోపలికి దించుతాడు. వాడు ఆకలేస్తుంది ఏమైనా పెట్టమంటాడు. ఏం పెట్టాలో తెలీదు. "నా దగ్గరేమీ లేదు" అని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు.

అక్కడ ఒక పిల్లాడిని దాచి ఉంచారన్న సంగతి స్నేహితులకు కానీ ఇంట్లో కానీ చెప్పడు. అదేదో తనకు మాత్రమే సంబంధించిన రహస్యం గా భావిస్తాడు.మర్నాడు ఒక కిరాణా కొట్టు కెళ్ళి , తన దగ్గరున్న డబ్బుతో ఏదైనా కొని పట్టుకెళ్ళాలి అనుకుంటాడు. \
కిట్ కాట్ కొంటే బాగుంటుందా చాక్లెట్ కొంటే బాగుంటుందా అని ఆలోచిస్తాడు. కొట్లో ఆమెని "ఆకలేస్తే ఏం పెడితే బాగుంటుంది ఎవరికైనా?" అని అడుగుతాడు.
 "ఆకలేస్తే ఏమి తింటారెవరైనా? బ్రెడ్" అని  అని ఆమె ముద్దుగా విసుక్కుని బ్రెడ్ ఇస్తే అది తీసుకెళ్ళి వాడికి పెడతాడు. ఇలా వాడితో రహస్య స్నేహం కొనసాగిస్తుంటాడు. వాడిని  వాడిని ఎలా కాపాడాలో, ఏమి చెయ్యాలో వీడికి తెలీదు . గోతిలోంచి బయటికి లాగి కాసేపు ఆ గోధుమ పొలాల్లో పడి దొర్లడం లోని ఆనందాన్ని   చూపిస్తూ ఆడిస్తాడు. బంధించి బంధించి ఉండటం వల్ల ఫిలిపో కాళ్ళు బిగుసుకు పోయి నడవలేక పొతే వాడిని వీపున ఎత్తుకుని మోస్తాడు.


ఇంతలో వాళ్ళింటికి నాన్న ఒక గెస్ట్ ని తీసుకొస్తాడు. ఆ గెస్ట్ చూడ్డానికే ఎంతో క్రూరంగా ఉంటాడు. రాత్రిళ్ళు పిల్లలు నిద్ర పోయాక నాన్న స్నేహితులు మరి కొందరు కలిసి టీవీలో వార్తలు చూసి తాగుతూ మాట్లాడుకోవడం ఫిలిప్పీ తన గది తలుపులు ఓరగా తీసి గమనిస్తాడు. ఆ టీవీ వార్తల్లో వాడికి ఒక విషయం తెలుస్తుంది. 

ఫిలిప్పోని కిడ్నాప్ చేసింది తమ ఇంట్లో ఉన్న గెస్ట్ సెర్జియో, తన తండ్రి, అతని స్నేహితులు అనే సంగతి!

అప్పుడు కూడా వాడు దిగ్భ్రాంతి చెందుతాడు తప్ప ఆ పిల్లాడిని రక్షించాలని తోచదు. ఎలా రక్షించాలో కూడా తెలీదు. ఇంతలో మిఛెల్ బాల్య  చాపల్యం తో  ఒక చిన్న కారు బొమ్మ కోసం ఆశపడి ఒక స్నేహితుడితో ఫిలిప్పో సంగతి చెప్తాడు.
 ఆ స్నేహితుడి వల్ల కిడ్నాపర్స్ కి విషయం తెలుస్తుంది. వాళ్ళలో ఒకడు (మిఛెల్ తండ్రి కాదు) మిఛెల్ ని రెడ్ హాండెడ్ గా ఫిలిప్పో దగ్గర ఉండగా పట్టుకుని చెయ్యి చేసుకుంటాడు. ఫిలిప్పోని అక్కడి నుంచి వేరే చోటికి తరలించి దాస్తారు.

మిచెల్ స్నేహితుడు ఫిలిప్పో ని ఎక్కడ దాచారో చెప్పేస్తాడు మిచెల్ స్నేహాన్ని తిరిగి సంపాదించడానికి ! నిజానికి వాడు కూడా ఒక చిన్న ఫాంటసీకి ప్రలోభ పడి మిచెల్ ఫిలిప్పోని కలుస్తున్న సంగతి కిడ్నాపర్స్ లో ఒకడికి చెప్తాడు. వాడికి కారు నడపాలని ఎన్నాళ్ళ నుంచో కోరిక! కిడ్నాపర్స్ లో ఒకడికి ఒక డొక్కు కారు ఉంది. ఆ కారు కాసేపు నడపడానికి ఒప్పుకునే షరతు మీద వాడు మిచెల్ ని పట్టిస్తాడు మొదట్లో!

ఇంతలో డిమాండ్ చేసిన మొత్తం చేతికి  రాక  పోగా కిడ్నాప్  పోలిస్ హెలికాప్టర్స్ మిఛెల్ గ్రామం మీద చక్కర్లు కొడుతూ ఉండటంతో  దిక్కు తోచని స్థితిలో , ఫిలిప్పోని చంపక తప్పదని నిర్ణయించుకుంటారు కిడ్నాపర్లు. వాడిని ఎలాగైనా రక్షించాలని మిఛెల్ అర్థ రాత్రి ప్రాణాలకు తెగించి సైకిల్ మీద ఆ పొలాలకు అడ్డం పడి వెళ్ళి వాడిని తాళం వేసి ఉన్న గేటు ఎక్కించి తప్పిస్తాడు. ఈ క్రమంలో వాడే ఫిలిప్పోకి నిచ్చెన అవుతాడు. తను మాత్రం ఎక్కలేక పోతాడు. ఆ గేటు తీసుకుని లోపలికి వచ్చిన మిఛెల్ తండ్రి అక్కడ ఉన్న పిల్లాడిని చీకట్లో ఫిలిప్పోగానే భావించి కాల్చేస్తాడు. 

తండ్రి గుర్తించే లోపుగానే ఆలస్యం అయిపోతుంది. ఆ శబ్దం విని పారి పోతున్న ఫిలిప్పో వెనక్కి వస్తాడు. చంపుత్గారేమో అన్న భయం లేకుండా మిచెల్ కోసమే వస్తాడు. రక్త  సిక్తమైన దేహంతో కళ్లు తెరిచిన మిచెల్ చాచిన చేతిని ఫిలిప్పో అందుకోవడం, అదే సమయంలో పోలిస్ హెలికాప్టర్లు అక్కడికి రావడం తో కథ ముగుస్తుంది.సినిమా మొత్తాన్ని మిచెల్ గా చేసిన గిసెప్పే క్రిస్టియానో సినిమా మొత్తాన్ని నడిపించేస్తాడు. ఈ సినిమా ఒక హిప్నోటిక్, మర్డర్ సస్పెన్స్ అదీ ఇదీ వర్ణించినా ఇది నాకు మాత్రం ఒక పసివాడి మనసుని యధా తధంగా చిత్రించిన రంగు రంగుల కేన్వాస్ లా కనిపించింది.

పదేళ్ళ పిల్ల వాడిగా మిచెల్ అంతరంగాన్ని మొత్తం వాడి కళ్లలోనే చదివేయొచ్చు. వాడి ఆశ్చర్యం, భయం ,బాధ, నిర్వేదం, కోపం, సంతోషం అన్నీ వాడి కళ్ళే చెప్పేస్తాయి. ఫిలిపో ని గోతిలో చూశాక వాడిని కాపాడాలనో పోలీసులకు చెప్పాలనో ఆలోచన వాడికి రాదు. కథ ఈ నాటిది కాక పోవడం కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు. 

ఇప్పటి పిల్లలకు అవేర్ నెస్ ఎక్కువే పోలీసుల గురించి!ఫిలిపో మంచి నీళ్ళు అడిగినపుడు పాడు బడ్డ ఇంట్లో, మిచెల్ కి అచ్చు తమ ఇంట్లో ఉన్న పింగాణీ గిన్నెల సెట్ లో లాంటిదే ఒక గిన్నె అదే డిజైన్ లో అక్కడ కనిపిస్తుంది. దాంతో వాడికి ఫిలిప్పో అక్కడ ఉండటానికి తండ్రికీ ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానం మనసులో రేకెత్తుతుంది. 
అలాగే చెల్లెలు ముందు రోజు డిన్నర్ లో తినకుండా వదిలేసిన మాంసాన్ని తండ్రి ఫ్రిజ్ లో పెట్టడాన్ని కూడా జాగ్రత్త గా గమనించి మర్నాడు ఫిలిపోని అడుగుతాడు "నిన్న నువ్వేమైనా మాంసం తిన్నావా?"(తండ్రి అది తెచ్చి పెట్టాడేమో అని) అని!

అయితే అది కిడ్నాప్ అని వాడి ఊహకు అందదు. ఒక్కడే గదిలో ఒక కథ ఊహించుకుని రాసుకుంటాడు. ఒక జంటకు ఇద్దరు పిల్లలు పుట్టారనీ, వాడిలో ఒకడు గుడ్డివాడు  కావడం వల్ల వాడిని వాడి తండ్రి ఒక గోతిలో ఉంచి చావకుండా ఆహారాన్ని తెచ్చిస్తూ ఉంటాడనీ.. ఇలా సాగుతాయి ఆ కథలో ఊహలు!అచ్చంగా పిల్లల మనసులో రేగే రూపం లేని అస్పష్టమైన గీతల్లా 

ఫిలిపో ఆకలేస్తున్నపుడు వాడికేం పెట్టాలో మిచెల్ కి అర్థం కాదు. ఆకలేస్తే ఎవరైనా బ్రెడ్ తినాలి అనే పరిజ్ఞానం వాడికి లేదు. ఎందుకంటే ఆకలి వేయక ముందే వాళ్ళమ్మ వాడికి బ్రెడ్ పెడుతుంది,. అందుకే గోతిలో అలమటిస్తున్న ఫిలిపో కి చాక్లెట్, కిట్ కాట్ వంటి పిల్లల ఫాంటసీ తిండ్లు తీసుకెళ్దాం అనుకుంటాడు.

మిచెల్ అమాయకంగా కనిపిస్తూనే వివేకంతో ఆలోచిస్తాడు ఈ సినిమాలో!ఫిలిప్పో విషయంలో తండ్రి పాత్ర ఉందో లేదో నిర్థారించుకోడానికి వాడు రక రకాలుగా ప్రయత్నిస్తాడు. కిడ్నాప్ వార్తలు టీవీలో దొంగచాటుగా చూశాక "నాన్నా, సెర్జియో నీ బాస్ కదు" అని అడుగుతాడు. ఫిలిప్పోని కలవడానికి వీల్లేదని వాళ్ళ నాన్న ఒట్టు వెయ్యమంటే "తండ్రి చచ్చినంత ఒట్టు, వాడిని కలవను" అని ఒట్టేస్తాడు. వేస్తున్నపుడు కూడా వాడి ఆలోచనలన్నీ ఆ పసి పిల్లాడి మీదే ఉంటాయి.

వాడిని చావు నుంచి కాపాడాలన్న తపనతో ఒట్టుని గట్టున పెట్టి అర్థ రాత్రి భయం వేస్తున్నా ఏవో మంత్రాల్లాటివి చదువుకుంటూ సైకిలేసుకుని వెళ్తాడు .
మానవ ప్రవర్తనలోని సహజ వైరుధ్యాన్ని దర్శకుడు ఒక విషయం ద్వారా ఆవిష్కరిస్తాడు. మిఛెల్ తండ్రికి తన ఇద్దరు పిల్లలన్నా ఎంతో ప్రాణం. వాళ్ళమ్మ గట్టిగా కోప్పడ్డా ఊరుకోడు. వాళ్లని ఎంతో ముద్దు చేస్తాడు. ఇంటికి అలసి పోయి వచ్చాక కూడా వాళ్లతో ఆడతాడు. అంత ప్రేమాస్పదమైన మనసు గల వ్యక్తి తన కొడుకు వయసే గల మరో కుర్రాడిని చీకటి గోతిలో కుళ్లు, మురికి, పురుగుల మధ్య వదిలేస్తాడు. 
మనిషి లో "తన " అనే స్వార్థం ఎంతగా జడలు విప్పి విచక్షణకు తావు లేకుండా చేస్తుందా అనిపిస్తుంది దీన్ని గమనిస్తే! మన కళ్ళెదురుగా ఉన్న సమాజాం లో కూడా ఇంతేగా.. పసి పిల్లని నిర్దాక్షిణ్యంగా డబ్బు కోసం కిడ్నాప్ చేసే వ్యక్తులకు పిల్లలుంటారు. ఆ పిల్లల కోసమే వాళ్లు అమానుష ప్రవర్తనకు పాల్పడతారు కాబోలు!

 Niccollo Ammaniti రాసిన నవల Lo non ho paura ఆధారంగా ఈ సినిమా తయారైంది. ఈ నవల మొత్తం 20 భాషల్లో ఏడు లక్షల కాపీలు అమ్ముడయ్యాయట. ఈ నవల ఇటలీలో టెర్రరిజం  సంక్షోభం నెలకొన్న సమయంలో జరీగ్న ఒక యదార్థ సంఘటన ఆధరంగానే రాశాడట రచయిత!బోల్డన్ని అవార్డులు దక్కించుకున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, రీ రికార్డింగ్ పెట్టని ఆభరణాలు!సినిమా మొత్తం వెంటాడే వయొలిన్ తరంగాలూ, నీలాకాశమూ, కాంట్రాస్ట్ గా గోధుమ పొలాలూ, ఎర్రని ఎండల్లో దక్షిణ ఇటలీ పల్లె సౌందర్యం అంతా కేన్వాస్ మీద  వర్ణ చిత్రం లా ఆవిష్కృతం !
ఈ సినిమా ట్రైలర్ ఇక్కడుంది  

ఒక పక్క థ్రిల్ కలిగిస్తూనే, పిల్లల మానసిక చిత్రావిష్కరణ చాటున దాన్ని దర్శకుడు మలిచిన తీరు భలే ఉంటుంది. ఒక విపత్కర పరిస్థితిలో పదేళ్ల పిల్లాడిలో రేగే కన్ ఫ్యూజన్, భయం, ఆందోళన, అంతకు మించి ఉప్పొంగే స్నేహ భావన వీటన్నిటినీ కళ్ళెదురుగా చూస్తున్న భావన! మనసు లోతుల్లోకి ఇంకి పోయెలా మిచెల్ మానసిక సంఘర్షణ డిక్షనరీ అవసరం లేకుండానే ప్రేక్షకుడికి అర్థమై పోతుంది. 

 ఈ సినిమా దర్శకుడి గురించి (గాబ్రియేల్ సాల్వతోరెస్) గురించి చదివాక ఆయన మిగతా సినిమాలన్నీ (హాపీ ఫామిలీ తప్ప ఇంకేమీ చూడలేదు) చూసెయ్యాలని నిర్ణయించుకున్నాను.
చూసే అవకాశం వస్తే వదులుకోకండి